: ప్రభుత్వ ఏర్పాటులో మా మధ్య విభేదాలు లేవు: పీడీపీ
జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పీడీపీ, బీజేపీల మధ్య విభేదాలున్నాయంటూ వస్తోన్న విమర్శలపై పీడీపీ అధికార ప్రతినిధి నయీం అక్తర్ స్పందించారు. ఇరు పార్టీల మధ్య ఎటువంటి విభేదాలూ లేవని పేర్కొన్నారు. మంత్రివర్గ శాఖల కేటాయింపు విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వచ్చిన వార్తలు నిరాధారమైనవని చెప్పారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముహూర్తాన్ని ఇరు పార్టీలు కలిసి నిర్ణయిస్తాయని తెలిపారు. ఇరు పార్టీల ఎమ్మెల్యేలూ కలిసి ఈ రోజు సాయంత్రం గవర్నర్ తో భేటీ కానున్నారని పేర్కొన్నారు. మరోవైపు, బీజేపీ శాసనసభా పక్షం ఈ రోజు సమావేశమై, పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఏకగ్రీవంగా నిర్ణయించింది.
అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీని బలపరుస్తున్నట్లు స్పష్టం చేసింది. తమ పార్టీ లెజిస్లేటివ్ లీడర్‌గా మాజీ డిప్యూటీ సీఎం నిర్మలా సింగ్ ని ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా కూడా ఆయననే నియమించనున్నట్లు తెలుస్తోంది.