: అమేజాన్ అధీనంలోకి వెళ్లనున్న ఫ్లిప్ కార్ట్!


భారత్ లోని అపరిమిత ఈ-కామర్స్ మార్కెట్లో దిగ్గజాలుగా ఉన్న అమేజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు విలీనం కాబోతున్నాయా? అంటే, అవుననే అంటున్నాయి ఇన్వెస్ట్ మెంట్ వర్గాలు. అమేజాన్ లో విలీనమయ్యేందుకు ఫ్లిప్ కార్ట్ యోచిస్తోందని, ఈ మేరకు చర్చలు కూడా సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ రెండు కంపెనీల మధ్యా డీల్ కుదిరేలా ఉందని, ఆపై రెండూ విలీనమైతే కనుక, దక్షిణాసియాలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఉద్భవిస్తుందని చర్చల గురించి తెలిసిన పలువురు బయటకు ఉప్పందించారు. 2015 చివరి త్రైమాసికంలో ఇరు కంపెనీల టర్నోవర్ ఆధారంగా చర్చలు సాగుతున్నాయని, ఫ్లిప్ కార్ట్ ఇన్వెస్టర్లే ముందుండి వీటిని సాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే, చర్చలు ఎంతకాలంలోగా ముగుస్తాయన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఇరు కంపెనీల మధ్యా ప్రాథమిక చర్చల్లో భాగంగా 8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 53,600 కోట్లు) ఆఫర్ అమేజాన్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. గడచిన ఏడాదిన్నర వ్యవధిలో ఫ్లిప్ కార్ట్ లోకి పెట్టుబడులు గణనీయంగా వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ షేర్ల విలువ 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 73,700 కోట్లు)ని మోర్గాన్ స్టాన్లీ నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్ విభాగం నిర్ణయించింది. గత సంవత్సరం ఆరంభంలో సంస్థ విలువ అంచనాతో పోలిస్తే ఇది 27 శాతం తక్కువ కావడం గమనార్హం. ఈ విషయంలో ఫ్లిప్ కార్ట్ సీఈఓ బిన్నీ బన్సాల్ స్పందన కోరగా, మార్కెట్ స్పెక్యులేషన్స్ పై తాము స్పందించబోమని అన్నారు. భారత మార్కెట్లో తాము అగ్రస్థానంలో ఉన్నామని, దీర్ఘకాల వ్యూహాలతో విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. అమేజాన్ గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఫ్లిప్ కార్ట్ లో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా వాటాలను కొనుగోలు చేయనుందని వార్తలు వచ్చిన సమయంలోనే ఈ డీల్ గురించిన సమాచారం బయటకు రావడం విశేషం. కాగా, 2016లో 23 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.54 లక్షల కోట్లు)గా ఉన్న భారత ఈ-కామర్స్ వాణిజ్యం 2020 నాటికి 69 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.62 లక్షల కోట్లు)కు పెరుగుతుందని గోల్డ్ మన్ సాక్స్ అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News