: ఎటూ తేలని డీఎంకే, కాంగ్రెస్ సర్దుబాటు!
త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాట డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్ఠానం పంపిన గులాంనబీ ఆజాద్, ఒట్టి చేతులతోనే వెనుదిరిగారు. ఈ ఉదయం చెన్నైకి వచ్చిన ఆయన, కరుణానిధి ఇంటికి వెళ్లి గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. చర్చల అనంతరం బయటకు వచ్చిన ఆజాద్ మీడియాతో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు.
తమ మధ్య పొత్తు ఖాయమని, ఎన్ని సీట్లలో ఎవరు పోటీచేయాలన్న విషయాన్ని తదుపరి మరోసారి సమావేశమై నిర్ణయిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో 5 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు పొత్తులో భాగంగా 65 సీట్లను డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ చర్చల్లో కరుణానిధి కుమారుడు అళగిరి, కుమార్తె కనిమోళి కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.