: కావూరికి షాకిచ్చిన ఎస్బీఐ!... ‘ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్’ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

కేంద్ర జౌళి శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కావూరి సాంబశివరావుకు ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిన్న షాకిచ్చింది. కావూరి కుటుంబం ఆధ్వర్యంలోని ‘ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్’ సంస్థ తనకు బకాయిపడ్డ అప్పులను రాబట్టుకునేందుకు ఎస్బీఐ దాదాపుగా రంగం సిద్ధం చేసింది. తొలుత కావూరి స్వయంగా ప్రమోట్ చేసిన ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్... ప్రస్తుతం ఆయన కుమార్తె శ్రీవాణి ముళ్లపూడి ఆధ్వర్యంలో నడుస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధి, నిర్మాణ రంగంలో దేశంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఎదిగిన ఈ సంస్థకు కావూరి కుమారుడు భాస్కర రావు కూడా గతంలో డైరెక్టర్ గా వ్యవహరించారు. 2013 దాకా మెరుగైన పనితీరు కనబరచిన ఈ సంస్థ... ఆ తర్వాత కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తింటోంది. ఫ్రాడ్ అండ్ కరెప్షన్ పాలసీని అతిక్రమించిన ఆరోపణలతో తాను చేపట్టే పనుల నుంచి ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్ ను ప్రపంచ బ్యాంకు 11 ఏళ్ల పాటు నిషేధించింది. ఈ దెబ్బతో కంపెనీ ఒక్కసారిగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఆ తర్వాత పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపులను కూడా ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్ సక్రమంగా నిర్వహించలేకపోయింది. ప్రస్తుతం ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్... వివిధ బ్యాంకులకు రూ.1,000 కోట్ల మేర బకాయి పడినట్లు సమాచారం. ఈ క్రమంలో రుణ బకాయిలను రాబట్టుకునేందుకు ఎస్బీఐ రంగంలోకి దిగింది. తనకు సదరు కంపెనీ బకాయిపడ్డ రూ.35.53 కోట్లను రాబట్టుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు అప్పు తీసుకునే సమయంలో తన వద్ద తాకట్టు పెట్టిన మూడు ఆస్తులను ఇప్పటికే ఎస్బీఐ తన స్వాధీనంలోకి తీసుకుంది. తాజాగా వీటిని వేలం వేసేందుకు ఆ బ్యాంకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల 29న నిర్వహించనున్న ఈ-వేలానికి సంబంధించి బ్యాంకు నిన్న స్పష్టమైన ప్రకటనను జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిసరాల్లోని వట్టినాగులపల్లి పరిధిలోని మూడు ఆస్తులను ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్ బ్యాంకుకు తనఖా పెట్టింది. కావూరి కూతురు శ్రీవాణి ముళ్లపూడి పేరిట ఈ ఆస్తులున్నాయి. వీటిలో రెండు ఆస్తులు 1.20 ఎకరాల విస్తీర్ణం చొప్పున ఉండగా, మరో ఆస్తి 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

More Telugu News