: వరల్డ్ కప్ తరువాత క్రికెట్ నుంచి తప్పుకుంటా!: షేన్ వాట్సన్
భారత్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు షేన్ వాట్సన్ తెలిపాడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాట్సన్ 2002లో సెంచూరియన్ మైదానంలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 2005లో పాక్ తో మొదలెట్టి టెస్టుల్లో ఆడడం ప్రారంభించాడు. టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన వాట్సన్, వన్డేల్లో 9 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు సాధించి, 168 వికెట్లు తీశాడు. టీ20ల్లో ఒక సెంచరీ చేసి, 75 వికెట్లు తీసిన వాట్సన్, 10 అర్థ సెంచరీలు, 46 వికెట్లు తీశాడు. నాణ్యమైన ఆల్ రౌండర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాట్సన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా రాణించాడు. గత ఏడాది యాషెష్ సిరీస్ తరువాత టెస్టు కెరీర్ కు గుడ్ బై చెప్పిన వాట్సన్, గత సెప్టెంబర్ నుంచి వన్డేలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని చెప్పిన వాట్సన్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. తరచు గాయాలబారిన పడడం కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఓ కారణమని వాట్సన్ తెలిపాడు.