: అద్భుతమంటే ఇదే... బోస్టన్ టు బ్రస్సెల్స్, ఉగ్రదాడుల ప్రాంతంలో ఉంటాడు, ప్రాణాలతో తప్పించుకుంటాడు!
పుట్టిన వారికి మరణం తప్పదు. కానీ అది ఎప్పుడు? ఎలా? ఏ రూపంలో వస్తుందో మాత్రం ఎవరికీ తెలియదు. అకారణంగా ఆయువు తీరిపోవచ్చు. కానీ, అపాయం పొంచివున్న చోట, అందునా విరుచుకుపడే ముష్కర మూకలు విచ్చలవిడిగా ప్రాణాలను బలిగొనే ప్రాంతాల్లో ఉండి కూడా ప్రాణాలు దక్కించుకోవడమంటే నిజంగా అదృష్టమే. అది కూడా ఒకటి, రెండు సార్లు కాదు. ముచ్చటగా మూడు సార్లు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల మాసన్ వెల్స్ విషయంలో ఇదే జరిగింది.
ఏప్రిల్ 2013లో బోస్టన్ మారథాన్ పై ఉగ్రదాడి జరిగిన వేళ, తన తల్లితో కలసి అక్కడే ఉండి ప్రాణాలతో బయటపడ్డ మాసన్, ఆపై రెండు సార్లు ఉగ్రదాడులను చూశాడు. గత సంవత్సరం నవంబరులో పారిస్ లోని పలు ప్రాంతాలపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో మాసన్ అక్కడే ఉన్నాడు. తిరిగి మొన్నటి బ్రస్సెల్స్ దాడి సమయంలో ఎయిర్ పోర్టులో ఉన్నాడు. ఈ ఘటనలో మాత్రం మాసన్ కు సమీపంలోనే పేలుడు సంభవించడంతో గాయపడ్డాడు. అతని తలకు గాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మాసన్ ఇలా మూడు ఉగ్రదాడుల సమయంలో అక్కడే ఉండి ప్రాణాలతో బయటపడటం అద్భుతమని శాండీలోని సెయింట్స్ చర్చ్ బిషప్ స్కాట్ బాండ్ వ్యాఖ్యానించారు.