: ఇలాంటి అర్థంపర్థం లేని కేసులు పెట్టకండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ జాతీయగీతాన్ని నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం ఆలపించారంటూ ఆయనపై ఎవరో కేసు పెట్టారని, పబ్లిసిటీ కోసం ఇటువంటి పనులు చేయవద్దని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణం హితవు పలికారు. జాతీయగీతాన్ని ఎక్కువ సమయం ఆలపించారని కేసు పెట్టారని, అలాంటి చట్టం ఎక్కడైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అమితాబ్ చక్కగా పాడారని, జాతీయగీతంలోని అన్ని పదాలను స్పష్టంగా ఉచ్చరించారని అన్నారు. దేశంలో ఇప్పటికే ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఇలాంటి అర్థంపర్థం లేని కేసులు పెట్టి న్యాయమూర్తులపై మరింత భారం వేయవద్దని బాలు సూచించారు. ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్, సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ, భీమ్ సేన్ జోషి, తాను కూడా జాతీయగీతాన్ని ఆలపించామని, అప్పుడెవ్వరూ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్ జాతీయ గీతం ఆలపించడం గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్ లో ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందు బిగ్ బీ జాతీయగీతం ఆలపించిన విషయం తెలిసిందే.