: దశాబ్దాల వివక్షకు చరమగీతం... దళితుల ఆలయ ప్రవేశం!
కన్నడనాట దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న దళిత వివక్షకు అధికారులు చరమగీతం పాడారు. అగ్రవర్ణాల తీవ్ర నిరసనల మధ్య హసన్ జిల్లా అరకేరి గ్రామంలోని కరియమ్మ దేవాలయంలోకి దళితులను తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. మొత్తం 25 మందికి అమ్మవారి దర్శనం చేయించారు. నిరసనలు తెలుపుతున్న ప్రజలు తాము వచ్చిన సమయంలో దేవాలయం వద్దకు రాలేదని స్థానిక అధికారులు తెలిపారు. తాము స్థానికంగా ఉన్న గుడిలోకి వెళ్లలేకపోతున్నామని మాదిగ వర్గం నుంచి అధికారులకు మెమొరాండం రాగా, అధికారులు సమావేశమై, వారిని గుడిలోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఈ విజయ తెలిపారు. దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఈ గుడిలోకి దళితులను, తక్కువ జాతి వారినీ రానివ్వలేదని తెలిపారు. అంతకుముందు చర్చల సందర్భంగా అగ్రకులాల వారిని ఆహ్వానించినా, వారెవరూ రాలేదని పేర్కొన్నారు.