: ఆ పదవి దక్కితే!... ఆపై ఎమ్మెల్యేగా గెలవడం కష్టమే!: పీఏసీ చైర్మన్ పదవిపై పెద్దిరెడ్డి కామెంట్స్
ఏపీ అసెంబ్లీలో ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ పదవిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు దక్కే ఈ పదవికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఆసక్తికర చర్చకు తెర తీశారు. ఈ పదవిని ఆశించిన వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్ నాథ్ రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలు... జగన్ నిర్ణయంతో షాక్ తిన్నారు. జగన్ నిర్ణయంపై నిన్న నిరసన గళం వినిపించి అమర్ నాథ్ రెడ్డి కలకలం రేపారు. దీనిపై జ్యోతుల నెహ్రూ మాత్రం గుంభనంగా వ్యవహరించారు.
ఇక జగన్ కు అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి తండ్రిగా పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కూడా పార్టీలో కీలక నేతే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో పూర్తి స్థాయిలో విభేదాలు కొనసాగించారు. అనంతరం తన కొడుకు మాటతో వైసీపీలో చేరిపోయారు. తాజాగా పీఏసీ పదవిపై ఆయన తనదైన శైలిలో నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పీఏసీ చైర్మన్ ఓ పెద్ద పదవా? దానిని చేపట్టినవారెవరూ ఆ తర్వాత ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నికై ఎమ్మెల్యే కాలేదు. యనమల రామకృష్ణుడు పీఏసీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత... నాలుగు సార్లు ఓడిపోయారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.