: భద్రత కోరిన హెచ్ సీయూ వీసీ.... రంగంలోకి దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నేటి ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు పలు నాటకీయ పరిణామాల మధ్య సుదీర్ఘ సెలవుపై వెళ్లిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం వర్సిటీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన అప్పారావు... ఇన్ చార్జీ వీసీగా ఉన్న పెరియాస్వామి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాక వెనువెంటనే తనకు అనుకూలంగా ఉన్న ప్రొఫెసర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు భగ్గుమన్నారు. వీసీ బంగ్లాపై దాడికి దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. లోపల వీసీ మీటింగులో ఉండగా, బయట విద్యార్థులు నినాదాలు చేస్తూ రణరంగాన్ని తలపించారు. ఈ క్రమంలో తనకు భద్రత కల్పించాలని అప్పారావు పోలీసులను అభ్యర్థించారు. దీంతో స్పందించిన పోలీసు బాసులు వెనువెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. ప్రస్తుతం కేంద్ర బలగాల కవాతుతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందా? అన్న భయాందోళనలు నెలకొన్నాయి.

More Telugu News