: ఆటిజం బాధిత చిన్నారులకు భావాలను బోధించే రోబో "టెక్0"
ఆటిజంతో బాధపడే పిల్లల కేసులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఈ రుగ్మతతో బాధపడుతోన్న పిల్లలు ఇతరులతో కలవలేకపోతుండటం, ఒంటరిగా గడపటం, భావవ్యక్తీకరణ లోపం, తమ అవసరాలను తీర్చుకునేందుకు తోటివారిని, తల్లిదండ్రులను వేలుపట్టుకుని అక్కడి వరకూ తీసుకువెళ్లటం వంటివి చేస్తుంటారు. అయితే ఇటువంటి పిల్లల కోసమే మెక్సికోలోని టెక్ డీ మాంటెర్రీ పరిశోధకులు ఇతరుల భావాలను బోధించే రోబోను రూపొందించారు. 50 సెం.మీ. పొడవుతో, ఎలుగుబంటి లాంటి ముఖం, చేతులతో.. కృత్రిమ మేధస్సు కలిగిన ఈ రోబోకు "టెక్0" అని నామకరణం చేశారు. ఆటిజంతో బాధపడుతోన్న పిల్లలకు ఇది పలు రకాలుగా సహాయపడుతుంది. చిన్నారుల తలకు అమర్చిన ఎలక్ట్రోడ్‌లున్న హెడ్‌సెట్‌తో వారి నాడీ సంకేతాలను ఇది గుర్తిస్తుంది. ఈ సంకేతాలను కంప్యూటర్‌కు పంపుతుంది. అక్కడ మానసిక నిపుణులకు అర్థమయ్యే భాషలో ఈ సంకేతాలు తర్జుమా అవుతాయి. దీంతో చిన్నారుల భావాలను వైద్యులు అర్ధం చేసుకునేందుకు అవకాశం కలుగుతోంది. దీంతో ఇతరులు చెప్పే విషయాలను కూడా చిన్నారులకు అర్థమయ్యేలా రోబో వివరిస్తుంది. ఆటిజంతో బాధపడే పిల్లలకు ఏదీ ఒక పట్టాన తలకెక్కదు. నలుగురిలో కలవలేరు. ఇలాంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెప్తున్నాయి. మన దేశంలో కోటి మంది ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు. వారిలో ఆరు లక్షల మంది మగపిల్లలున్నారు. ఇలాంటి పిల్లలకు "టెక్0" రోబో ఓ వరంలా రానుంది.