: 'ఫ్రీడమ్ 251'పై రంగంలోకి దిగిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్
కేవలం రూ. 251కే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని చెప్పి సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ కంపెనీ గత లావాదేవీలపై ఎస్ఎఫ్ఐఓ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) విచారించనుంది. ఈ విషయాన్ని టెలికం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటుకు వెల్లడించారు. ప్రపంచంలోనే చౌక ధరకు ఫోన్ అందిస్తామని ప్రకటించి, రెండు రోజుల వ్యవధిలో కోట్లాది ఆర్డర్లను పొందిన రింగింగ్ బెల్స్ ఆపై, ఫోన్లను అందించడంలో విఫలమై పరువు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. సంస్థ దస్త్రాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధీనంలోని ఎస్ఎఫ్ఐఓ పరిశీలించనుందని ఆయన తెలిపారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ చట్టంలోని సెక్షన్ 206 ప్రకారం, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎస్ఎఫ్ఐఓ మాత్రం ఈ కేసును సుమోటోగా పరిగణిస్తోందని, ఆ సంస్థ అనుమానాస్పద కార్యకలాపాలపై ఓ కన్నేశామని మంత్రి వివరించారు.