: యూఎస్ కమిషన్కు భారత్ వీసా నిరాకరణపై చైనా మీడియా ప్రశంసల జల్లు
మత స్వేచ్ఛపై పరిశీలన కోసం యునైటెడ్ స్టేట్స్ కమిషన్ కు భారత్ వీసా జారీ చేయకపోవడంపై చైనా మీడియా ప్రశంసల జల్లు కురిపించింది. యూఎస్ ఆధ్వర్యంలో పాశ్చాత్య సంస్కృతి చొరబాటును న్యూఢిల్లీ సమర్థంగా ఎదుర్కొంటుందని, దేశప్రజల ప్రయోజనాల మేరకే తమ విదేశీ విధానాన్ని అవలంబిస్తోందని ప్రశంసించింది. ఈ విధానమే స్వతంత్ర భారతావనిలో ప్రాముఖ్యం కలిగిన ఓ అంశం అని పేర్కొంది.
మత స్వేచ్ఛపై పరిశీలన కోసం యూఎస్ కమిషన్ కు భారత్ వీసా జారీ చేయకపోవడం... పాశ్చాత్య సత్సంబంధాలను కొనసాగించడంలో స్థిరమైన భారతీయ సాంప్రదాయాన్ని సూచిస్తోందని చైనా మీడియా చెప్పింది. విదేశీ వ్యవహారాలను సమర్థంగా నిరోధించగలిగే సత్తా భారత్ కు ఉందని ప్రశంసల వర్షం కురిపించింది. భారత్ స్వతంత్ర, స్వయం ఆధారిత విధానాలతో పాశ్చాత్య దేశాల సాంస్కృతిక చొరబాటుకు అవకాశాలు లేకుండా చేస్తున్నదని ప్రశంసించింది.
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై పరిశీలన చేసే యూఎస్ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్)కి భారత్ వీసా మంజూరు చేయకపోవడం ఇది మొదటిసారి కాదని, 2009లోనూ భారత్ ఈ విషయమై వీసా నిరాకరించిందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అయితే, యూఎస్ లో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మతాన్ని వేరు చేసి చూసే ఉదంతంపై యూఎస్సీఐఆర్ఎఫ్ ప్రభుత్వ విధానాన్ని ఎత్తిచూపలేదని తెలిపింది. ఏదేమైనా భారత్ వీసా మంజూరు చేయకపోవడంపై యూఎస్ అధికారులు నిరాశ చెందారని, పాశ్చాత్య సంస్కృతి చొరబాటు పట్ల సమర్థవంతంగా పనిచేస్తోందని చైనా మీడియా పేర్కొంది.