: ఆ మందుబిళ్లలు ఇక షాపుల్లో కనిపించవు!

జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే ఫార్మసీ స్టోర్ నుంచి విక్స్ యాక్షన్ 500 మందు బిళ్లలు తెచ్చుకుని వేసుకునే వారికి ఇకపై ఆ అవకాశం ఉండదు. ఇలాంటి చాల రకాల టాబ్లెట్లు ఇకపై స్టోర్లలో లభించవు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు విక్స్ యాక్షన్ 500 ఎక్స్ ట్రా బిళ్లల తయారీ, విక్రయాలను నిలిపివేస్తున్నట్టు బహుళజాతి కంపెనీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ తాజాగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 344 రకాల కాంబినేషన్ మందులను నిషేధిస్తూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ నుంచి ఈ నిర్ణయం వెలువడింది. ఫెనిల్ ప్రైన్, పారాసెటమాల్, కెఫిన్ ఈ మూడు ముందులు కలిసున్నదే విక్స్ యాక్షన్ 500 ఎక్స్ ట్రా. అలాగే ఫెన్సిడిల్, కోరెక్స్ వంటి దగ్గుమందులపై కూడా కేంద్రం వేటు వేసింది. ఇలా 344 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్ డీసీ) మందులను ప్రజారోగ్యం దృష్ట్యా నిషేధించింది. రెండు అంతకంటే ఎక్కువ రకాల మందులను కలిపి ఒక సింగిల్ డోసేజీ టాబ్లెట్ రూపంలోకి తీసుకురావడాన్నే ఎఫ్ డీసీ అంటారు. అయితే, ఈ కాంబినేషన్లలో కొన్నింటిని వాడడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎఫ్ డీసీ మందులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే విక్రయించాలి. కానీ మార్కెట్లో ఉన్న ఎఫ్ డీసీ మందుల్లో చాలా వరకు అనుమతి లేకుండా విక్రయిస్తున్నవేనని ఓ అంచనా. ఓ ఉదాహరణ చూస్తే... ప్రముఖ బహుళజాతి కంపెనీ అబ్బాట్ ఇండియా సెఫిక్సిమ్, అజిత్రోమైసిన్ అనే రెండు రకాల యాంటీబయోటిక్స్ ను కలిపి ఒకే ఔషధంగా విక్రయిస్తోంది. వాస్తవానికి ఈ మందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి అనుమతి లేదు. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి చాలా దేశాల్లో ఈ రకమైన కాంబినేషన్ మందు బిళ్లలకు అనుమతి లేదు. కానీ భారత మార్కెట్లో ఏదైనా చెల్లుతుందిలేనన్న ధోరణితో అబ్బాట్ ఈ విధంగా అక్రమంగా అమ్మకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిషేధం విధించిన 344 ఎఫ్ డీసీ ఔషధాలు ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని కేంద్రం స్పష్టం చేసింది. మార్కెట్లో సురక్షితమైన ప్రత్యామ్నాయ ముందులు ఉన్నాయని సూచించింది. ఈ ఔషధాల దుష్ప్రభావాలను శాస్త్రవేత్తలు అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. కనుక మనం కూడా వాటికి దూరంగా ఉండడం మంచిదనుకోవాలి.

More Telugu News