: శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం
మరోసారి భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తూ కూలీలు ఎదురుపడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై లొంగిపోవాలంటూ గాల్లోకి కాల్పులు జరపడంతో అక్కడున్న సుమారు 30 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యారు. సంఘటనా స్థలం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.