: సమయం లేదు!... అవిశ్వాసంపై వైసీపీ ఎమ్మెల్యేలకు ఎస్ఎంఎస్ లో విప్ జారీ
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సర్కారుపై ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ కు స్పీకర్ అనుమతి ఇచ్చిన సంగతి విదితమే. సభలో పదో వంతు సభ్యులు తీర్మానానికి అనుకూలంగా వుంటే, చర్చకు అనుమతి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. తీర్మానంపై చర్చకు అధికార పక్షం కూడా సై అంది. అయితే ఇక్కడే ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇటీవలే వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు వచ్చి టీడీపీలో చేరారు. వారు ఏ పక్షానికి మద్దతుగా నిలవాలన్న అంశాన్ని తేల్చేందుకు వైసీపీ సరికొత్త ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో ఆ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది.
విపక్ష వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే విప్ జారీకి ఏమాత్రం అవకాశం లేకుండా వెనువెంటనే చర్చకు అనుమతించింది. టీడీపీ క్విక్ రియాక్షన్ తో సతమతమైన వైసీపీ, ఎలాగైనా తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని తలచింది. ఇంకేముంది, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ తన ఎమ్మెల్యేలకు మొబైల్ ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ లో విప్ జారీ చేసింది. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఎంఎస్ లు ఈరోజు పెట్టినవి కాదని, శుక్రవారమే వాటిని పంపామని పేర్కొన్నారు. ఇక మరికాసేపట్లో ప్రారంభం కానున్న చర్చలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.