: హైద‌రాబాదులో 'నో పార్కింగ్' ఏరియాలో వాహ‌నాలు నిలిపితే ఇక జైలుకే!

అస‌లే త‌మ వాహ‌నాలు పార్కింగ్ చేసుకోవడానికి స్థ‌లాలు దొర‌క‌క ఇబ్బందులు ప‌డే హైద‌రాబాదు వాసులకు మ‌రో త‌లనొప్పి వ‌చ్చి ప‌డుతోంది. నో పార్కింగ్ ఏరియాలో వాహ‌నాలు నిలిపితే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. త‌మ పంతం మార్చుకోకుండా ప‌దేప‌దే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకోనున్నారు. కొత్తగా రూపొందించిన‌ రూల్స్ ప్ర‌కారం.. ట్రాఫిక్ జామ్‌కి కార‌ణ‌మ‌య్యేలా, ప్ర‌మాద‌కర సంఘ‌ట‌న‌లు జ‌రిగేలా రోడ్డుపై లేదా ఇత‌ర ప్ర‌దేశాల్లో వాహ‌నాలు నిలిపి మూడోసారి ప‌ట్టుబ‌డితే వాహ‌న‌దారున్ని కోర్టులో హాజరుపర్చి, జైలు శిక్ష విధించ‌నున్నారు. రోడ్డుపై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌ప‌డుతోన్న వాహనాలు రోడ్డు ప్ర‌మాదాలకు కార‌ణ‌మ‌వుతుండడంతో ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రోడ్డుపై ప్ర‌యాణం చేసే ఇత‌రులు దీంతో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, రూల్స్ ఉల్లంఘిస్తే ఉపేక్షించ‌బోమ‌ని అడిష‌న‌ల్ క‌మీష‌న‌ర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ జితేంద‌ర్ అన్నారు. పార్కింగ్ రూల్స్ ఉల్లంఘ‌నతో పాటు ఓవ‌ర్ స్పీడ్ డ్రైవింగ్‌, రేసింగ్, సిగ్న‌ల్స్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసే వారిని కూడా త‌మ టీమ్ వ‌దిలిపెట్ట‌ద‌ని ఆయ‌న‌ చెప్పారు. ఇన్నాళ్లూ అలాంటి వారికి ఫైన్ లు వేశామని, ఇక‌పై జైలుశిక్ష త‌ప్ప‌ద‌ని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల డేటా ప్ర‌కారం హైద‌రాబాద్‌లో ప్ర‌తీ నెలా ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి రెండు ల‌క్ష‌ల మంది చలానాలు క‌డుతున్నారు.

More Telugu News