: రాజీవ్ గాంధీని హత్య చేసి పెద్ద తప్పు చేశాం!... ఎల్టీటీఈ సిద్ధాంతకర్త పశ్చాత్తాపం
‘‘భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసి పెద్ద తప్పు చేశాం. అది మా విధానాలకే విరుద్ధం. చాలా దురదృష్టకరం’’ అని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) సిద్ధాంతకర్త ఆంటన్ బాలసింగమ్ పశ్చాత్తాపపడ్డాడు. ఈ మేరకు శ్రీలంకలో నార్వే మాజీ ప్రత్యేక దూత ఎరిక్ సోలిమ్ ను ఉటంకిస్తూ రచయిత మార్క్ సాల్టర్ తాను రాసిన ‘టు ఎండ్ ఏ సివిల్ వార్’పుస్తకంలో పేర్కొన్నారు.
గతంలో సోలిమ్ ను కలిసిన బాలసింగమ్... రాజీవ్ హత్యపై పశ్చాత్తాపాన్ని ప్రకటించారని సాల్టర్ పేర్కొన్నారు. అయితే సోలిమ్ తో బాలసింగమ్ మాట్లాడిన విషయాలన్నీ అనధికారికమేనని సాల్టర్ తన పుస్తకంలో స్పష్టం చేశారు. ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన ఈ పుస్తకం ఆధారంగా రాజీవ్ హత్యకు సంబంధించి ఎల్టీటీఈ అనుసరించిన దాగుడు మూతల వైఖరి కింది విధంగా ఉంది.
రాజీవ్ గాంధీ తిరిగి భారత ప్రధానిగా బాధ్యతలు చేపడితే తమపై మూకుమ్మడి దాడి జరగడం ఖాయమన్న భావనతోనే ఎల్టీటీఈ చీఫ్ ‘పెద్ద పులి’ ప్రభాకరన్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అయితే సంస్థ సిద్ధాంతకర్తగా ఉన్న బాలసింగమ్ వద్ద ఈ విషయాన్ని దాచిన ప్రభాకరన్... తన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మాన్ తో కలిసి కార్యాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత చాలాకాలం వరకూ రాజీవ్ హత్య తమ పని కాదని ప్రభాకరన్ చెబుతూ వచ్చాడు. చాలాకాలానికి బాలసింగమ్ వద్ద ప్రభాకరన్ అసలు విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత లండన్ లో ఆశ్రయం పొందిన బాలసింగమ్ 2006లో కేన్సర్ తో మరణించాడు. చనిపోవడానికి ముందు రాజీవ్ హత్యపై ఆయన భారత్ ను క్షమాపణ కోరేందుకు యత్నించి విఫలమయ్యాడు.