: ఆస్తులు లేవు... అప్పులూ లేవు!: ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న మాల్యా


లెక్కలేనన్ని ఆస్తులు.. వేల కోట్ల రూపాయల అప్పులు. ఇదీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆర్థిక పరిస్థితి. లిక్కర్ వ్యాపారంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన విజయ్ మాల్యా, ‘కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్’ పేరిట పౌర విమానయాన రంగంలోకి ప్రవేశించి, దివాలా తీసిన బిజినెస్ మ్యాన్ గా రికార్డులకెక్కాడు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా అప్పులను ఎగవేస్తున్నారంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అప్పులిచ్చిన బ్యాంకులన్నీ మాల్యాను ‘విల్ ఫుల్ డిఫాల్టర్’ గా ప్రకటించాయి. అయితే 2010లో రాజ్యసభకు రెండో దఫా ఎన్నికైన సందర్భంగా మాల్యా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ ను పరిశీలిస్తే... ఆయన ఎంతమాత్రం డిఫాల్టర్ కాదని చెప్పక తప్పదు. ఎందుకంటే, తనకు ఆస్తులతో పాటు అప్పులు కూడా లేవని మాల్యా సదరు అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన పేరిటే కాక, తన భార్య, కుటుంబసభ్యుల పేర్లపై ఏ ఒక్క ఆస్తి లేదని చెప్పిన మాల్యా... 2000 ఏడాదిలో రూ.25 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఫెర్రారీ కారు మాత్రం ఉందని పేర్కొన్నారు. బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన మాల్యా లండన్ కు గుట్టుచప్పుడు కాకుండా పారిపోయారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ అఫిడవిట్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపైనే నిన్న పార్లమెంటులో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ లు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.

  • Loading...

More Telugu News