: ప్రాక్టీస్ మ్యాచ్ లో సత్తా చాటిన భారత్... కరీబియన్లపై అలవోక విజయం
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నకు ముందు సన్నాహకంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటింది. టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ వీర విహారంతో పటిష్టమైన వెస్టిండిస్ జట్టుపై అలవోక విజయం సాధించింది. తనకు అచ్చొచ్చిన పిచ్ పై ఓ స్థాయిలో రెచ్చిపోయిన రోహిత్ కేవలం 57 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. సెంచరీకి సమీపించిన రోహిత్ చివరి రెండు బంతులకు పరుగులు తీయలేక శతకం మిస్సయ్యాడు. టాస్ లేకుండా పరస్పర అవగాహనతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రోహిత్ కు తోడుగా యువరాజ్ సింగ్ (31) కూడా తనదైన శైలిలో రాణించడంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఆ తర్వాత 186 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కరీబియన్లు 19.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటయ్యారు. ఆ జట్టు స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ (20)ను టీమిండియా కుర్ర బౌలర్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో కరీబియన్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయారు. 140 పరుగులకే వెస్టిండిస్ జట్టు చాపచుట్టేయడంతో భారత్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.