: చంద్రబాబుకు 'చీటింగ్ చీఫ్ మినిస్టర్' బిరుదివ్వొచ్చు: ఎమ్మెల్యే రోజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చీటింగ్ చీఫ్ మినిస్టర్ బిరుదు ఇవ్వవచ్చని నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, అధికార పార్టీ సభ్యుల పిల్లలే కీచకులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాగార్జున వర్శిటీ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య, తహశీల్దారు వనజాక్షి వ్యవహారంలో ప్రభుత్వ విప్ చింతమనేని దౌర్జన్యం... తదితర అంశాలను ఆమె ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రవేశపెట్టిన ఏపీ ఆర్థిక బడ్జెట్ పై కూడా ఆమె విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర బడ్జెట్ ను ఇంగ్లీషులో చదవడం దురదృష్టకరమన్నారు. ఈ బడ్జెట్ లో మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు.