: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం... పిట్స్ బర్గ్ కాల్పుల్లో ఐదుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలకు తెర పడటం లేదు. ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్న ఈ తరహా ఘటనలు ఆ దేశ ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా పిట్స్ బర్గ్ లో నిన్న (భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం) ఆయుధాలు చేతబట్టి రంగంలోకి దిగిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పిట్స్ బర్గ్ కు 13 కిలో మీటర్ల దూరంలోని విల్కిన్స్ బర్గ్ లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డట్లు సమాచారం.
మరణించిన వారిలో నలుగురు మహిళలు సహా ఓ చిన్నారి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇద్దరు గన్ మెన్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పగా, దుండగుల సంఖ్య ఏడు నుంచి ఎనిమిది మంది దాకా ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాల్పులు జరిపిన దుండగులకు సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు.