: మాల్యాను రప్పిస్తాం!... ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమన్న మోదీ సర్కారు
రుణాలిచ్చిన బ్యాంకులను బురిడీ కొట్టించి, ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేసింది. విదేశానికి వెళ్లిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించి తీరతామని ప్రకటించింది. అక్రమార్కుల్లో ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని కూడా కాస్తంత ఘాటుగానే స్పందించింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ విస్పష్ట ప్రకటన చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియానికి మాల్యా రూ.9 వేల కోట్లకు పైగా బకాయి పడ్డ సంగతి తెలిసిందే. తన కంపెనీలను అమ్మేసుకుని విదేశాలకు చెక్కేయనున్నట్లు మాల్యా నుంచి ప్రకటన రాగానే ఎస్బీఐ సహా మిగిలిన బ్యాంకులు స్పందించాయి. కోర్టులను ఆశ్రయించాయి. అయితే అప్పటికే మాల్యా లండన్ కు వెళ్లిపోయారు. దీనిపై నేటి పార్లమెంటు సమావేశాల్లో బాగంగా విపక్షాల ప్రశ్నలకు స్పందించిన ప్రభుత్వం మాల్యాను దేశానికి తిరిగి రప్పించి తీరతామని ప్రకటించింది.