: ఏపీ అసెంబ్లీలోనూ ఆంగ్లో-ఇండియన్... గుంటూరుకు చెందిన ఫిలిప్ కు తొలి ఛాన్స్

తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మైనారిటీల ప్రతినిధిగా అసెంబ్లీలో ఓ ఆంగ్లో-ఇండియన్ సభ్యుడికి చోటుండేది. హైదరాబాదుకు చెందిన క్రైస్తవుల్లో ఒకరికి ఈ పదవి దక్కుతూ వచ్చింది. రాష్ట్రం విడిపోయే నాటికి ఎల్విస్ స్టీఫెన్ సన్ ఆ పదవిలో ఉన్నారు. మొన్న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చిన ‘ఓటుకు నోటు’ కేసులో ఆయన కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఆ స్థానం తెలంగాణ అసెంబ్లీలోకి వెళ్లిపోయింది. ఏపీ అసెంబ్లీలో ఇప్పటిదాకా ఆ పదవి లేదు. అయితే మైనారిటీ వర్గాలకు ప్రతినిధిగా ఉండాల్సిన సదరు స్థానాన్ని ఏర్పాటు చేయాలని, అందులో తమ ప్రతినిధిని నియమించాలని పలు వర్గాలు ఏపీ సర్కారును వేడుకున్నాయి. ఈ క్రమంలో అందుకు సమ్మతించిన ప్రభుత్వం ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ సభ్యుడిగా గుంటూరుకు చెందిన ఫిలిప్ సి.తోచర్ ను ప్రతిపాదించింది. దీనికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సరేననడంతో నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్... ఫిలిప్ ను అసెంబ్లీకి నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఫిలిప్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉంటూ వస్తున్న ఫిలిప్ పార్టీ మైనారిటీ విభాగంలో పనిచేస్తున్నారు.

More Telugu News