: 'కొరియా'ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ రెండు దేశాల మధ్య నిరంతరం విభేదాలు రగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాను, దానికి మద్దతిస్తున్న అమెరికా వంటి దేశాలకు ఉత్తర కొరియా సవాళ్లు విసురుతూనే ఉంది. ఈ క్రమంలో తమ దేశానికి చెందిన ఉన్నత స్థాయి అధికారుల స్మార్ట్ ఫోన్లను ఉత్తర కొరియా హ్యాక్ చేస్తోందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఉత్తర కొరియా నాలుగో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తమ దేశంలో కీలక పదవుల్లో ఉన్న అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, గత రెండు రోజులుగా అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచమని తమ సైన్యాన్ని ఉత్తర కొరియా ఆదేశించింది. వెంటనే మీటనొక్కితే శత్రుదేశాలు సర్వనాశనమేనని హెచ్చరించింది. దీంతో మరోసారి ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.