: జగన్ వర్సెస్ రావెల!... సుశీల్ కేసు ప్రస్తావనకు పరిటాల రవి హత్య కేసుతో సమాధానం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేటి ఉదయం ప్రారంభమైన రెండో రోజు సమావేశాల్లో రసవత్తర వాదన చోటుచేసుకుంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్, రిషితేశ్వరి ఆత్మహత్య, కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం, తహశీల్దార్ వనజాక్షిపై దాడి ఘటనలను ప్రస్తావించిన జగన్... రాష్ట్రంలో మహిళలపై అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యకాండను నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ కీచక పర్వాన్ని ఆయన ప్రస్తావించారు. మద్యం మత్తులో మహిళను చేయిపట్టి లాగిన వ్యక్తి తండ్రి చంద్రబాబు కేబినెట్ లో ఇంకా కొనసాగుతున్నారని ఆరోపించారు. దీంతో వేగంగా స్పందించిన రావెల కూడా జగన్ ఆరోపణలను తిప్పికొట్టారు.
మహిళల అభ్యున్నతికి బాటలు వేసిన దివంగత నేత ఎన్టీఆర్ బాటలోనే తాము నడుస్తున్నామని రావెల పేర్కొన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంగా తన కుమారుడిని తానే స్వయంగా పోలీసులకు అప్పగించానన్నారు. దర్యాప్తులో తన కొడుకు తప్పు ఉందని తేలితే, ఏ శిక్ష వేసినా ఇబ్బంది లేదన్నారు. ఈ సందర్భంగా రావెల... పరిటాల రవి హత్యోదంతాన్ని ప్రస్తావించారు. తమ పార్టీలో బలమైన నేతగా ఉన్న రవిని హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న జగన్ ను విచారించడానికి సీబీఐ వస్తే, నాటి సీఎం కుర్చీలో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వారిని ఆపేశారని ఆరోపించారు. సీబీఐ అధికారులను బెదిరించి జగన్ ను కేసు నుంచి తప్పించారన్నారు. అలాంటి దౌర్జన్యకాండకు తాము పాల్పడటం లేదని రావెల ఘాటుగా బదులిచ్చారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది.