: ఇన్వెస్టర్ల సంపదకు రూ. 92 వేల కోట్లు జోడించిన 5 కార్పొరేట్ కంపెనీలు!
గత సోమవారం పార్లమెంట్ ముందుకు తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన తరువాత, స్టాక్ మార్కెట్లు ఎనలేని ఉత్సాహంతో ముందుకు దూకిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు, ప్రధానంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొత్తగా ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాగా, మార్కెట్ దాదాపు 8 శాతం వరకూ పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్ ను నమ్ముకున్న ఇన్వెస్టర్ల సంపద రూ. 5.21 లక్షల కోట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలు 5,500కు పైగా ఉండగా, కేవలం ఐదు కార్పొరేట్ దిగ్గజాలు ఇన్వెస్టర్ల సంపదను రూ. 92 వేల కోట్లు పెరిగేందుకు సహకరించాయి. గత వారంలో టాటా, రిలయన్స్, అదానీ, బిర్లా, హిందుజా కంపెనీల ఈక్విటీలు భారీగా లాభపడగా, ఆ మేరకు సంస్థలో వాటాలున్న ప్రతి ఇన్వెస్టర్ కూ ఎంతో కొంత లాభం దగ్గరైంది. టాటా గ్రూప్ లో 28 కంపెనీలు ఉండగా, వాటిల్లో 26 కంపెనీలు లాభపడ్డాయి. ఈ కంపెనీలు బీఎస్ఈ మార్కెట్ కాప్ ను రూ. 50,299 కోట్లు పెంచాయి. టాటా స్టీల్ 16 శాతం, టాటా మోటార్స్ 13.68 శాతం, టీఆర్ఎఫ్ 14 శాతం పెరిగాయి. దీంతో టాటా గ్రూప్ మార్కెట్ కాప్ సైతం రూ. 6.65 లక్షల కోట్ల నుంచి రూ. 7.15 లక్షల కోట్లకు పెరిగింది. టాటాల తరువాత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ నిలిచింది. రిలయన్స్ సంస్థలు ఈ వారంలో మార్కెట్ కాపిటలైజేషన్ ను రూ. 18,212 కోట్లు పెంచాయి. ఆపై ఆదిత్య విక్రమ్ బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్, హిందుజా, అదానీ కంపెనీలు నిలిచాయి. ఆదిత్యా బిర్లా గ్రూప్ లోని అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో, ఐడియా సెల్యులార్ తదితర కంపెనీల విలువ రూ. 9,396 కోట్లకు పైగా పెరిగి రూ. 1.88 లక్షల కోట్లను దాటింది. హిందుజా సంస్థలు రూ. 8,170 కోట్లు, అదానీ గ్రూప్ లోని సంస్థలు రూ. 5,913 కోట్లు లాభపడ్డాయి. వీటితో పాటు భారతీ ఎయిర్ టెల్, అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ గ్రూప్, బిర్లా గ్రూప్ లోని 9 సంస్థలు సైతం చెప్పుకోతగ్గ లాభాలను నమోదు చేశాయి.