: వైఎస్ జగన్ పై మరో కేసు!... ‘సాక్షి’ చైర్ పర్సన్ హోదాలోని ఆయన భార్య భారతిపై కూడా!

ఇప్పటికే అక్రమాస్తుల వ్యవహారంలో లెక్కకు మిక్కిలి కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిన్న మరో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా పొన్నూలు పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు భూదందాకు పాల్పడుతున్నారంటూ జగన్ కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఇక ఈ కథనాన్ని ఆధారం చేసుకుని వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నిన్న పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వైఎస్ జగన్ పై కేసు నమోదు చేశారు. పొలిటికల్ మెంటార్ ఆఫ్ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ హోదాలో జగన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, జగతి పబ్లికేషన్స్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ఇక ‘సాక్షి’ పత్రిక పబ్లిషర్ హోదాలో ఉన్న సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, జగతి పబ్లికేషన్ డైరెక్టర్లు హన్నప్పనహల్లి వీరన్న ఈశ్వరయ్య, వై.ఈశ్వరప్రసాద్ రెడ్డి, వి.శ్రీధర్ రెడ్డి, రాజప్రసాదరెడ్డి, పీవీకే ప్రసాద్, ప్రకాశరావు అంతుర్ నారాయణ్, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ డైరెక్టర్లు ఎల్.బలరాంరెడ్డి, వీర్మణి బాలరాజు, బండి రాణిరెడ్డి తదితరులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

More Telugu News