: పెళ్లి పేరిట మోసం చేయడమే ఆమె పని... ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న మోసాలు!
ఆ యువతి పేరు శ్రుతి (20). చేసే పనేమో... డబ్బున్న యువకుడిని పెళ్లి పేరుతో బుట్టలో వేసుకోవడం, ఆపై సన్నిహితంగా మెలిగి అందినంత దోచుకోవడం. ఆమె వ్యవహారం బయటకు వచ్చిన తరువాత, తమను కూడా మోసం చేసిందంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన చెందిన శ్రుతిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కోయంబత్తూరు సమీపంలోని పలమత్తివెల్లూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్ కుమార్, తనకు వివాహ సంబంధ వెబ్ సైట్ ద్వారా పరిచయమైన శ్రుతి అనే పేరున్న యువతి 43 లక్షలు తీసుకుందని, తనను వివాహం చేసుకుంటానని మోసం చేసిందని ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆపై కుటుంబం కష్టాల్లో ఉందని చెబుతూ, వివాహానికి సంవత్సరం గడువు అడిగిందని, ఆపై కనిపించకుండా పోయిందని చెప్పాడు. అంతకుముందే ఆమెపై పుదుచ్చేరి, నాగపట్నం స్టేషన్లలో రెండు కేసులు నమోదైనట్టు పోలీసులు కనుగొన్నారు.
ఆపై ఆరుళ్ కుమార్ గురు రాజా (28) అనే యువకుడు సైతం ఇదే తరహా ఫిర్యాదు చేసి, తాను ఓ సినిమా నటిని అని శ్రుతి పరిచయం చేసుకుందని, వాట్స్ యాప్ ద్వారా కలిసిందని కుమార్ వెల్లడించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె మాటలు నమ్మి, రూ. 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు ఫిర్యాదు చేశాడు. శ్రుతి ఈ విధంగా ఇంతవరకూ దాదాపు రూ. 2 కోట్లకు పైగా వసూలు చేసి వుండవచ్చని భావిస్తున్న పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి విచారణ జరుపుతున్నారు. కాగా, ఆమె బారినపడి మోసపోయిన వారి సంఖ్య మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు.