: తప్పించుకుపోతున్న విజయ్ మాల్యా... బ్యాంకులు కదలవేం?
మరో కార్పొరేట్ వైట్ కాలర్ బ్యాంకులను ముంచేసి వెళ్లిపోతున్నాడు. వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకుల నుంచి తీసుకుని, ఆపై వాటిని చెల్లించకుండా, ఇప్పుడు కంపెనీనే కాదు... దేశాన్ని కూడా వదిలి వెళ్లిపోతున్నాడు. దాదాపు రూ. 500 కోట్లు తీసుకుని బ్రిటన్ కు వెళ్లిపోతున్నాడు. భారత కార్పొరేట్ చరిత్రలో ఇలా రుణాలు ఎగ్గొట్టి, ఆపై మంచి ఆఫర్ తో దేశం దాటుతున్న తొలివ్యక్తి ఇతనే. ఆయనే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా! యూబీ గ్రూప్ నుంచి పూర్తిగా వైదొలగేందుకు డియాజియో నుంచి ఆయన తీసుకుంటున్న మొత్తం రూ. 500 కోట్లు. ఈ మొత్తం ఎందుకో తెలుసా. వచ్చే ఐదేళ్ల పాటు, బ్రిటన్ మినహా మరే దేశంలోనూ డియాజియోకు పోటీగా మాల్యా వ్యాపారం చేయకూడదు. యూబీ గ్రూప్ కు మాల్యా రాజీనామా వార్త బయటకు వచ్చిన తరువాత తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సంస్థలకు రుణాలుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇచ్చిన బ్యాంకులకు సమాధానం చెప్పేదెవరు? తాకట్టు పెట్టుకున్న ఆస్తులను వేలం వేసినా రికవరీ 10 శాతం కూడా రాదన్నది ఓ అంచనా. ఈ నేపథ్యంలో రూ. 500 కోట్లు తీసుకుని మరీ దేశం దాటుతున్న మాల్యాను ఆపేదెవరు? ఆయన్ను దేశం దాటనీయవద్దని ఒక్క బ్యాంకు కూడా ఫిర్యాదు చేయదేం? సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టి, తాను మాత్రం లగ్జరీ జీవితాన్నే అనుభవించిన మాల్యా కంపెనీల్లో నెలల తరబడి వేతనాలు అందక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభమై, మూడేళ్ల క్రితమే మూతపడ్డ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో అయితే, ఇప్పటికీ ఉద్యోగులకు జీతాల బకాయిలు అందాల్సి వుంది. తన మోసపూరిత చర్యలతో భారత బ్యాంకింగ్ వ్యవస్థను, ఉద్యోగులను మోసం చేసిన మాల్యాను చట్టం ముందు నిలపాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ పెరుగుతోంది.