: ఏపీ పాఠ్య పుస్తకాల్లో సత్య నాదెళ్ల, మల్లి మస్తాన్ బాబుల జీవితచరిత్ర... పదో తరగతిలో అమరావతి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ లో ఆరు నుంచి పదో తరగతి వరకు తెలుగు ఉపవాచకాలు, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. పాఠ్య పుస్తకాల్లో కొత్తగా పలువురు ప్రముఖ వ్యక్తుల జీవిత కథలను చేర్చింది. అందులో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు వంటి పలువురి జీవితచరిత్రలను చేర్చడం జరిగింది. జూన్ 2016 విద్యా సంవత్సరం నుంచి 'స్పూర్తి ప్రదాతలు' అనే శీర్షికతో వీటిని పాఠాలుగా ఆయా విద్యార్థులు చదువుకుంటారు.
ఈ నేపథ్యంలో ఎనిమిదో తరగతి విద్యార్థుల తెలుగు ఉపవాచకంలో నాదెళ్ల, మస్తాన్ బాబుతో పాటు ప్రఖ్యాత రచయిత, చిత్రకారుడు దివంగత సంజీవ్ దేవ్ జీవిత కథను చేరుస్తున్నట్టు ఏపీ ఎస్ సీఈఆర్ టీ డైరెక్టర్ రాజ్యలక్ష్మీ తెలిపారు. ఏడో తరగతి తెలుగు ఉపవాచకంలో జానపద కళలను తెలియజేసే విధంగా కూచిపూడి, హరికథ, బుర్రకథ, తప్పెటగుళ్లు పాఠ్యాంశాలను చేరుస్తున్నారు. పదో తరగతి ఉపవాచకంలో 'మన రాజధాని' పేరుతో అమరావతి చరిత్ర, ప్రాముఖ్యాన్ని తెలియజేసే అంశాలను పాఠ్యాంశంగా చేర్చనున్నారు.