: డంపింగ్ యార్డులో కరెన్సీ కట్టల బ్యాగ్... కొట్టుకున్న సెక్యూరిటీ గార్డులు
హైదరాబాదులోని జవహర్ నగర్ లో కొద్దిసేపటి క్రితం పెద్ద కలకలం రేగింది. జవహర్ నగర్ సమీపంలోని డంపింగ్ యార్డులో పడ్డ ఓ పెద్ద బ్యాగులో భారీ మొత్తంలో కరెన్సీ కట్టలు ఉన్నాయట. ఎలా బయటపడ్డాయో కాని, బ్యాగులో భారీ సంఖ్యలో నోట్ల కట్టలున్నాయని అటు డంపింగ్ యార్డు సిబ్బందితో పాటు అక్కడ భద్రతా విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులకూ తెలిసిపోయింది. ఇంకేముంది, బ్యాగు తనకు దక్కాలంటే, కాదు తనకే దక్కాలంటే సెక్యూరిటీ గార్డులు ఘర్షణకు దిగారు.
ఇక సెక్యూరిటీ గార్డులే కొట్టుకుంటూ ఉంటే, తమకు ఎక్కడ చిక్కుతాయనుకున్నారో, ఏమో... యార్డు సిబ్బంది సమాచారాన్ని పోలీసుల చెవిన వేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఆ బ్యాగులో ఉన్న కరెన్సీ నోట్లు అసలువా? లేక నకిలీవా? అన్న విషయాన్ని నిర్ధారించే పనిలో పోలీసులు వున్నారు. మరికాసేపట్లో ఈ విషయానికి సంబంధించి అసలు విషయం తెలియనుంది.