: కన్నయ్య జాతి వ్యతిరేక నినాదాలు చేయలేదు: కోర్టుకు ఢిల్లీ పోలీసుల నివేదిక

దేశవ్యాప్తంగా పెను కలకలం రేపుతున్న జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వివాదంలో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు తమ అత్యుత్సాహాన్ని ఒప్పుకున్నారు. పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా జేఎన్ యూలో ఈ నెల 9న జరిగిన ర్యాలీలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారన్న కారణంగా వర్సిటీ స్టూడెంట్ యూనియన్ నేత కన్నయ్య కుమార్ సహా ఆరుగురిపై పోలీసులు రాజద్రోహం కేసులు పెట్టారు. అంతేకాక ఈ నెల 12న కన్నయ్యను అరెస్ట్ చేసి తీహార్ జైల్లోకి నెట్టారు. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని కన్నయ్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నోటీసులు అందుకున్న ఢిల్లీ పోలీసులు నిన్న ఓ నివేదికను కోర్టుకు అందజేశారు. సదరు నివేదికలో కన్నయ్య అసలు దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని పోలీసులు ఒప్పుకున్నారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తుతున్న సమయంలో అతడు అక్కడ ఉన్నాడట. ఈ మాత్రానికే అతడిపై రాజద్రోహం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News