: పరిటాల-జేసీ సర్దుబాటును ప్రస్తావించిన చంద్రబాబు... మెత్తబడ్డ రామసుబ్బారెడ్డి
నిన్నటిదాకా వైసీపీ నేతగా ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా టీడీపీ నేతగా మారిపోయారు. అయితే ఆదినారాయణరెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జీ, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆయన చేరికను చివరి దాకా అడ్డుకునే యత్నం చేశారు. నిన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి పిలుపుతో విజయవాడ వెళ్లిన ఆయన తన పెద్దమ్మ లక్ష్మీదేవమ్మను వెంటబెట్టుకుని మరీ వెళ్లారు. ఆదినారాయణరెడ్డి కారణంగా తాము ఎంతమేర ఇబ్బందులకు గురయ్యామో చూడండంటూ... ఫ్యాక్షన్ కక్షల్లో చేతులు కోల్పోయిన టీడీపీ కార్యకర్తను ఆయన చంద్రబాబు ముందు నిలబెట్టారు. ఆదితో రాజకీయ వైరం కారణంగా తన భర్తనే కోల్పోయానని, ఇఫ్పుడు ఆదిని పార్టీలో చేర్చుకుని తమకెలా న్యాయం చేస్తారంటూ లక్ష్మీదేవమ్మ కూడా చంద్రబాబును నిలదీసినంత పనిచేశారు.
అయితే ఈ తరహా ప్రశ్నాస్త్రాలను ముందుగానే ఊహించిన చంద్రబాబు... వాటన్నిటికీ సరైన సమాధానాలనే తన వద్ద సిద్ధంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దంటూ రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మలు చేసిన వాదనను సాంతం విన్న చంద్రబాబు... ఆ తర్వాత అసలు సిసలు అస్త్రాలను బయటకు తీశారు. రాయలసీమకు చెందిన అనంతపురం జిల్లాలోని మాజీ మంత్రి దివంగత పరిటాల రవి కుటుంబానికి, ప్రస్తుత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి మధ్య ఉన్న వైరాన్ని ఆయన ప్రస్తావించారు. సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగిన పరిటాల, జేసీ కుటుంబాలు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జేసీ బ్రదర్స్ చేరికను పరిటాల రవి సతీమణి సునీత అంగీకరించారని చెప్పారు. అయితే ఆ తర్వాత పరిటాల సునీతకు మంత్రి పదవిచ్చి ప్రాధాన్యమిచ్చిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మీరు కూడా సర్దుకుపోవాలని, భవిష్యత్తులో ప్రాధాన్యమిస్తామన్న చంద్రబాబు ప్రతిపాదనతో కాస్తంత మెత్తబడ్డ రామసుబ్బారెడ్డి... ఆదినారాయణరెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.