: పీఏసీ పదవికి భూమా రాజీనామా... ‘ఇక గంటలు, రోజులే’నని కామెంట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. జగన్ భయపడినంతా అయ్యింది. జగన్ పార్టీ ఎమ్మెల్యేల బలం రెండు తగ్గిపోనుంది. టీడీపీ ప్లాన్ వర్కవుటైంది. ‘ఫ్యాన్’ కింద నుంచి పక్కకు రానున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి... ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న తన కూతురు అఖిల ప్రియతో కలిసి ‘సైకిల్’ ఎక్కనున్నారు. ఈ మేరకు విషయాన్ని సూటిగా చెప్పకున్నా, టీడీపీలో చేరడం ఖాయమేనని భూమా తేల్చిచెప్పారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని అసెంబ్లీలో జరిగిన ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సమావేశానికి హాజరైన ఆయన కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కమిటీకి సంబంధించిన పలు కీలక ఫైళ్లను ఆయన కమిటీ సభ్యులకు అందజేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన భూమా మీడియా ప్రతినిధులతో పొడిపొడిగానే మాట్లాడినా, తన ఉద్దేశాన్ని మాత్రం సుస్పష్టంగా చెప్పేశారు. ‘‘చెప్పాల్సిన సమయంలో అంతా చెబుతా. ఏం చేసినా, మీడియాకు చెప్పిన తర్వాతే చేస్తా’’ అని ప్రకటించారు. ఎంత సమయంలో చెబుతారంటూ ప్రశ్నించిన మీడియా ప్రశ్నలకు చిరునవ్వుతోనే సమాధానమిచ్చిన ఆయన ‘‘రోజులు పట్టొచ్చు. గంటల్లోనే అయిపోవచ్చు. వేచి చూడండి’’ అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మరికాసేపట్లో భూమా హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News