: ఇక 'బంగారు' సంస్కరణలు... కొత్త బోర్టు, స్పాట్ ఎక్స్ఛేంజ్ కూడా!


నానాటికీ పెరిగిపోతున్న బంగారం స్మగ్లింగ్ ను అరికట్టడంతో పాటు జాతీయ స్థాయిలో బులియన్ బోర్డును ఏర్పాటు చేయాలని, బంగారం లావాదేవీలకు స్టాక్ మార్కెట్ తరహాలో స్పాట్ ఎక్స్ఛేంజ్ ని ప్రారంభించాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ప్రతిపాదిత గోల్డ్ రిఫార్మ్స్ అమలు విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయమై చర్చించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ప్రతినిధులు, బులియన్ వాటాదారులు, ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ అధికారులు, వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు నేడు సమావేశమయ్యారు. బంగారం వాణిజ్యాన్ని మరింత పారదర్శకంగా, సులభతరంగా రూపొందించడమే లక్ష్యంగా వార్షిక బడ్జెట్ లో రానున్న ప్రతిపాదనలపై అరుణ్ జైట్లీతో వీరు చర్చించనున్నారు. ముడి బంగారం దిగుమతిపై సుంకాలను విధించే అంశంలో వాడివేడి చర్చ జరుగుతుందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రిఫైనింగ్ కంపెనీలు ఎటువంటి ఎక్సైజ్ సుంకాలనూ చెల్లించకుండా దిగుమతులు సాగిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని కఠినం చేయాలన్నది కేంద్ర అభిమతం కాగా, బులియన్ సంస్థలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన బంగారం నగదీకరణ పథకం పట్ల ప్రజలకు మరింత ఆసక్తిని పెంచేందుకు మరికొన్ని రాయితీలను ప్రకటించాలని జైట్లీ భావిస్తున్నట్టు సమాచారం. అహ్మదాబాద్ నగరం సమీపంలో నిర్మించతలపెట్టిన గోల్డ్ సెజ్ పైనా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News