: డీటీహెచ్, కేబుల్ టీవీ వ్యవస్థలోనూ ఇక పోర్టబిలిటీ!
ఏదైనా ఒక టెలికం సంస్థ సిమ్ కార్డు వాడుతూ, ఆ సంస్థ సేవలు నచ్చకుంటే, అదే ఫోన్ నంబరుతో మరో టెలికం సంస్థకు మారే సదుపాయం అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే ఎంఎన్పీ (మొబైల్ నంబర్ పోర్టబిలిటీ). ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో ఇక డీటీహెచ్, కేబుల్ టీవీ విభాగాల్లోనూ పోర్టబిలిటీ సౌకర్యాన్ని దగ్గర చేయాలని ట్రాయ్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఏ సంస్థ సెట్ టాప్ బాక్సును వాడుతున్నా, మరో సంస్థకు మారాలని భావిస్తే, ఇంకో సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. మరో రెండు నెలల వ్యవధిలో ఇందుకు సంబంధించిన విధివిధానాల ఖరారు పూర్తవుతుందని ట్రాయ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతకన్నా ముందు ఈ రంగంలోని అన్ని కంపెనీల అభిప్రాయాలనూ స్వీకరిస్తామని వివరించారు.