: గ్రేటర్ ప్రజల ప్రాణాలతో 'పోస్టర్ల' చెలగాటం!

ఇటీవలి గ్రేటర్ ఎన్నికలైతేనేమి, ఆపై కేసీఆర్ జన్మదినమైతేనేమి... టీఆర్ఎస్ కార్యకర్తలు రహదారుల మధ్యలోని స్తంభాలకు వేలాడదీసిన పోస్టర్లు అన్యమనస్కంగా నడిచే పాదచారుల పాలిట మృత్యుద్వారాలవుతున్నాయి. గట్టిగా ఉన్న వెదురు కర్రల సాయంతో వేలాడదీసిన ఈ పోస్టర్లను వేగంగా వెళుతున్న ఏ బైకర్ అయినా తాకితే, అతని శరీరం చీరుకుపోవడం ఖాయం. ఇక ఎంత వేగంగా వెళుతున్నాడన్న దానిపైనే బైకర్ కు తగిలే గాయాల తీవ్రత ఆధారపడివుంటుంది. కేసీఆర్ 63వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్లు, కింది స్థాయి నేతల వరకూ తమ తమ ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లు పెద్దఎత్తున రోడ్లపై ప్రదర్శనకు ఉంచారు. వాస్తవానికి ఇలా పోస్టర్లను రోడ్లపై ఉంచకూడదన్న నిబంధనలు ఉన్నాయి. ప్రజల సెంటిమెంట్ ను పరిగణనలోకి తీసుకునే జీహెచ్ఎంసీ అధికారులు ఉత్సవాలు, లేదా వేడుకలు ముగిసిన రెండో రోజు వీటిని తొలగిస్తుంటారు. కానీ ఈ దఫా అవి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే పోస్టర్లు కావడంతో వాటి జోలికి పోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే వాటిని తొలగించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

More Telugu News