: పఠాన్ కోట్ దాడిపై పాక్ ఎఫ్ఐఆర్... పలువురిపై కేసు నమోదు

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి సంబంధించి ఎట్టకేలకు పాకిస్థాన్ దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది. పాక్ భూభాగంపైనే దాడికి రూపకల్పన జరిగిందని భారత్ వాదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలను పాక్ కు అందజేసింది. ఈ క్రమంలో ఆ దేశ దర్యాప్తు సంస్థలకు చెందిన కీలక అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటించినా, చర్యల విషయానికి వచ్చేసరికి ఆ దేశ అధికారులు భారత్ కు మస్కా కొట్టారు. దాడికి సూత్రధారిగా భావిస్తున్న జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేశామని ప్రకటించిన ఆ దేశ అధికారుల మాటలు ఆ తర్వాత ఒట్టివేనని తేలింది. అయితే అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో ఎట్టకేలకు దారిలోకి వచ్చిన పాక్ ప్రభుత్వం... పఠాన్ కోట్ దాడికి సంబంధించి నేటి ఉదయం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో పలువురి పేర్లను ప్రస్తావించిన ఆ దేశ ప్రభుత్వం కేసు దర్యాప్తును ముమ్మరం చేయనున్నట్లు ప్రకటించింది. ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి పేర్లున్నాయన్న వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

More Telugu News