: సెల్ఫీ సరదాతో ప్రాణాలు తీసుకోవడమే కాదు... ప్రాణాలు తీస్తున్నారు కూడా!
సెల్ఫీ... నేటి యువతరానికి అత్యంత మోజు ఇదే. ఓ సెల్ఫీ తీసుకుని దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఎన్ని ఎక్కువ లైక్ లు వస్తే, అంత సంబరపడిపోయే రోజులివి. ఆ సరదా ఒక్కోసారి విలువైన ప్రాణాలను తీస్తున్న ఘటనలను ఎన్నో చూశాం. ఇప్పుడు అదే సరదా ఓ మూగజీవి ప్రాణాలు తీసింది.
అర్జెంటీనాలోని ఓ బీచ్ లో చిన్న డాల్ఫిన్ ఒకటి ఒడ్డుకు కొట్టుకురాగా, దానితో సెల్ఫీ దిగాలని భావించిన వందలాది మంది ఎన్నో పోజులిచ్చారు. దాన్ని నీటి నుంచి బయటకు తీసి ముద్దు చేస్తూ, పోజులిచ్చారు. ఈ మొత్తం ఘటన నిమిషాల నుంచి గంటకు పైగా సాగింది. దీంతో ఆ డాల్ఫిన్ మరణించింది. శాంతా తెరిసితా నగరపు బీచ్ లో ఈ ఘటన జరుగగా, అర్జెంటీనా వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ కల్పించుకుంది. బీచ్ లలో తిరిగే వారికి డాల్ఫిన్లు కనిపిస్తే, వాటిని ఇబ్బంది పెట్టకుండా, తిరిగి నీటిలో విడిచిపెట్టాలని కోరింది. డాల్ఫిన్ తో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వారికి ఇప్పుడు లైక్ లు రావడం లేదు సరికదా, తిట్లు మిగులుతున్నాయి.