: గౌరవం ఉన్నంతవరకే తెదేపాలో, లేకుంటే...: మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

తనకు గౌరవం ఇస్తున్నంత వరకూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి, కడప జిల్లా తెలుగుదేశం నేతల్లో ప్రముఖుడు రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్న వార్తలు గుప్పుమన్నప్పటి నుంచి రామసుబ్బారెడ్డి కొంత ముభావంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆది చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, 'జిల్లాలో పార్టీ బలోపేతం' అంటూ ఆయన రాకను సీఎం చంద్రబాబు కూడా స్వాగతించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఈ ఉదయం తన అనుచరులు, కార్యకర్తలతో రామసుబ్బారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆది చేరికపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధిపైనే తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. గౌరవం ఇచ్చినంత వరకూ పార్టీలోనే ఉంటానని, ఆపై కార్యకర్తల మాటే తన మాటని చెప్పారు. తన నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు లభించడం అదృష్టమని వ్యాఖ్యానించారు.

More Telugu News