: 'ఫ్రీడమ్ 251' లెక్క తేలేదెలా? ఈ ప్రశ్నలకు సమాధానమేది?
ఓ సగటు భారతీయుడి రోజు సంపాదన ఎంత? అందుబాటులోని లెక్కల ప్రకారం రూ. 251. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి నైపుణ్యమూ లేని పనివారికి ఎన్ఆర్ఈజీయే ఇస్తున్న ఉపాధి వేతనం రూ. 250 కన్నా తక్కువే. ఇక రింగింగ్ బెల్స్ తామందిస్తున్న స్మార్ట్ ఫోన్ ధరను రూ. 251గా ఉంచడానికి కారణం తలసరి ఆదాయం దానికి దగ్గరగా ఉండటమేనట. ఈ సంగతి అలా ఉంచితే, మార్కెటింగ్ గిమ్మిక్కులు, డబ్బు నొక్కేసి సంస్థను మూసేద్దామన్న ఆలోచన రింగింగ్ బెల్స్ కు లేదనుకుంటే నిజంగా రూ. 251 ఫోన్ అత్యంత అద్భుతమే. దీన్ని ఈ శతాబ్దపు అద్భుతంగానూ చెప్పవచ్చు.
ఓ మొబైల్ తయారీకి (ఫ్రీడమ్ 251 స్పెసిఫికేషన్స్ తో) కావాల్సిన ముడి పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటే రెండేళ్ల క్రితం దాని బిల్లు 30 డాలర్లు (సుమారు రూ. 2 వేలు). ఇప్పుడా బిల్లు దాదాపు సగానికి, అంటే 15 డాలర్లకు (సుమారు రూ. 1000)కి తగ్గి ఉండవచ్చు. పరికరాలు తెచ్చి వాటిని అసెంబ్లింగ్ చేస్తే, మరో రూ. 200 అదనంగా పడుతుంది. ఇక డిస్ట్రిబ్యూషన్, కమిషన్లతో కలిపి రూ. 1400కు దాన్ని అమ్ముకుంటేనే సంస్థ నిలబడుతుంది. ఇక ఫ్రీడమ్ 251ను రూ. 251కి ఇస్తున్నారంటే, మిగతా రూ. 1,149 నష్టపోతున్నట్టే. ఎవరో ఒకరు ఈ నష్టాన్ని భరించాలి. వారెవరు?
కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రాయితీలు కల్పించిందని ఓ వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే పారదర్శకత పాటించడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైనట్టే. రాయితీలు అందిస్తామని ముందుగా తెలియజేస్తే, దేశవాళీ సంస్థలైన సెల్ కాన్, మైక్రోమ్యాక్స్ వంటివి ముందుకు వచ్చుండేవి కదా? ఇక్కడ సమాధానం లేని ప్రశ్నలు అనేకం కనిపిస్తున్నాయి. ఓ విధానాన్ని పాటించకుండా తమకు ఇష్టమొచ్చిన కంపెనీకి రాయితీలు ఇవ్వడం మోదీ సర్కారుకు తగునా?
ఇక దీని వెనుక ఓ ఉదారవాది ఎవరైనా ఉన్నారా? ప్రజలకు చౌకధరలో ఫోన్ అందించేందుకు తన ఆస్తిని దానమిస్తున్నారా? ఈ విషయాలకు సమాధానం లేదు. వాస్తవానికి ఫోన్ ధరలను గణనీయంగా తగ్గించి అమ్మడం ఇండియాలో ఎంతో కాలంగా ఉంది. దాదాపు 10 సంవత్సరాల క్రితమే అంబానీ, రూ. 500కు రిలయన్స్ ఫోన్ ప్రకటించి దేశంలో పెను సంచలనానికి తెరతీశారు. ఆపై కూడా కొన్ని టెలికం సంస్థలు తక్కువ ధరలకు ఫోన్లను అందించినప్పటికీ, వారంతా ఆయా ఫోన్లను లాక్ చేసి తమ సేవలు మాత్రమే అందేట్టు చేశారు. దీనివల్ల కస్టమర్ మరో టెలికంను ఆశ్రయించలేడు సరికదా... వాడకం పెరిగే కొద్దీ ఫోన్ చార్జీల రూపంలో డబ్బు వస్తుందన్నది ఆయా సంస్థల మూల ఆలోచన. ఇది ఎయిర్ టెల్ వంటి కొన్ని సంస్థలకు లాభించింది కూడా.
ఇప్పుడు విడుదలైన ఈ ఫ్రీడమ్ 251కు ఎటువంటి నిబంధనలూ లేవు. ఏ టెలికం సంస్థ సేవలైనా అందుకోవచ్చు. రూ. 251 ధరకు ఫోన్ విక్రయించి లాభాలను పొందాలనుకోవడం ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం. అంటే, మిగిలిపోయే నష్టాన్ని భరించేందుకు ఎవరో ఒకరు ముందుకు వచ్చుండాలి. వాళ్లెవరు?
పేదలకు స్మార్ట్ ఫోన్ అందించాలని భావిస్తూ, నిజంగా ఫోన్ కు ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చివుంటే, ఫోన్ బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు ఆధార్ అనుసంధానం చేసి వుండేది. ఎందుకంటే, తామిచ్చే సబ్సిడీ నిజమైనవారికి చేరాలన్నది మోదీ ప్రధాన లక్ష్యం కాబట్టి. ఈ దిశగా ఆలోచిస్తే మాత్రం ప్రభుత్వ సబ్సిడీ అందలేదని సులువుగానే అర్థమవుతుంది.
ఏతావాతా అనుమానాలేమంటే, లక్ష రూపాయలకు టాటా నానో కారు అన్నా, రూ. 1500కు టాబ్లెట్ అని డేటావిండ్ ప్రచారం చేసుకున్నా అవి దీర్ఘకాలం మాటపై నిలబడలేదు. ఏదో ఒకదశలో ధర వద్ద సర్దుకుని పెంచాల్సిన పరిస్థితి రతన్ టాటా వంటి వారికే ఎదురైంది. ఇక ఈ ఫ్రీడమ్ 251 విషయంలో రింగింగ్ బెల్స్ ఏం చేస్తుందో? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారో?