: రోడ్డు ప్రమాదంలో రెండుగా తెగిన శరీరం... నింజప్ప త్యాగం నిరుపమానం!

హరీష్ నింజప్ప (23)... ఇప్పుడు కోట్లాది మంది భారత యువతకు నిజమైన మార్గదర్శి. తన ప్రాణాలు నిమిషాల్లో పోతాయని తెలుసుకున్న ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికీ ఆదర్శమనడంలో ఎటువంటి సందేహం లేదు. తుముకూరు జిల్లాలోని సొంత గ్రామం గుబ్బిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ, ఓటేసేందుకు వచ్చిన నింజప్ప, తిరిగి బెంగళూరుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పంచదార లోడ్ తో వెళుతున్న ఓ లారీ ఆయన బైక్ ను ఢీకొట్టగా, శరీరం రెండు ముక్కలైంది. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తూనే, హైవే అంబులెన్స్ పై ఆసుపత్రికి తరలించారు. అతనికి తన పరిస్థితి తెలుసు. ప్రాణాలు ఎంతో సేపు ఉండవని భావించిన నింజప్ప, తన శరీరంలోని పనికొచ్చే అన్ని అవయవాలనూ దానం చేయాలని కోరాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు హెల్మెట్ ఉండటంతో తలకు గాయాలు కాలేదు. అందువల్లే అంత తీవ్రంగా గాయపడ్డా, ఆలోచించే శక్తిని కోల్పోలేదు. కొన్ని నిమిషాల పాటు నింజప్ప మాట్లాడుతూనే ఉన్నాడు. "నా శరీరంలో ఏ భాగం పనికొస్తే దాన్ని దానం చేయండి. ప్లీజ్..." అవే నింజప్ప ఆఖరి మాటలు. యాక్సిడెంట్ తరువాత 8 నిమిషాల్లోపే ఆయన్ను ఆసుపత్రికి చేర్చగా, ఆపై మరికొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. బ్యాంకులకు లాజిస్టిక్ సేవలందించే ఎస్ఎస్ఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి హరీష్ నింజప్ప కళ్లు ఇప్పుడు నారాయణా నేత్రాలయాలో భద్రంగా ఉన్నాయని, ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ భుజంగ శెట్టి తెలిపారు. ఈ ప్రమాదంలో మనిషి రెండుగా ఎలా తెగిపడ్డాడో చూస్తేనే ఒళ్లు జలదరించి పోయిందని ఆయన తెలిపాడు. ప్రమాదంలో ఎముకలు, కండరాలు, రక్తనాళాలు తెగిపోయాయని, మెదడుకు మాత్రం ఏం కాలేదని నింజప్పను తరలించిన హోస్మాత్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అజిత్ బెనడిక్ట్ వెల్లడించారు. నింజప్ప ఆఖరి కోరికను తీర్చేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ నింజప్పా!

More Telugu News