: అదృష్టవశాత్తు బతికిపోయా...లేకపోతేనా...!: అమితాబ్
అదృష్టవశాత్తు బతికిపోయానని బాలీవుడ్ దిగ్గజం బిగ్ బీ అన్నారు. ముంబైలో మేకిన్ ఇండియా వారోత్సవాల కార్యక్రమంలో నిన్న చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం గురించి ఆయన ట్విట్టర్లో స్పందించారు. అప్పుడే తన పెర్ఫార్మెన్స్ ముగించుకుని ఇంటికి బయల్దేరానని, ఇంతలోనే వేదిక అగ్నికి ఆహుతైందని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుక నిర్వాహకులు తనను కాసేపు ఉండాలని కోరారని, సీఎం ఫడ్నవీస్ ను కలిసి వెళ్లాలని సూచించారని, అయితే తనకు వేరే పని ఉండడంతో వెళ్లిపోయానని ఆయన వెల్లడించారు. వారు కోరినట్టు ఉండి ఉంటే మంటల్లో చిక్కుకుని ఉండేవాడినేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతపెద్ద ఘటనకు వెంటనే స్పందించిన భద్రతాధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, ఎవరి ప్రాణాలకూ నష్టం వాటిల్లకపోవడంతో ఆనందం కలిగిందని అమితాబ్ పేర్కొన్నారు. అయితే ఇది భయంకరమైన అనుభవంగా మిగిలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.