: పోలీసులకు లొంగిపోనున్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని... నేడు పటమట పీఎస్ లో సరెండర్!
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటికే నగరంలో కలకలం సృష్టించిన కల్తీ మద్యం ఘటనలో నగరానికి చెందిన కీలక రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (కాంగ్రెస్) జైలుకెళ్లారు. తాజాగా అధికార పార్టీ టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వల్లభనేని సిద్ధమయ్యారు. నేడు ఆయన పోలీసులకు సరెండర్ కానున్నారు.
నిన్న నగరంలోని రామవరప్పాడు పరిధిలోని పేదల పూరి గుడిసెలను మునిసిపల్ అధికారులు తొలగించేందుకు యత్నించారు. ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను ఎలా తొలగిస్తారంటూ అక్కడి స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వామపక్షాల నేతలతో పాటు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అక్కడకు వెళ్లారు. బాధితుల పక్షాన మాట్లాడిన వంశీ, ఇళ్ల తొలగింపును నిలిపివేయాలని అధికారులను కోరారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆయన పేదలకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో గుడిసెవాసులతో కలిసి ఆయన నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన పటమట పోలీసులు వల్లభనేనిపై కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న ఆయన ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఈ కేసులో తానే స్వయంగా పోలీసులకు సరెండర్ కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. నేటి ఉదయం ఆయన తన అనుచరులతో కలిసి పటమట పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ కానున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్న ఈ వ్యవహారంపై నగరంలో జోరుగా చర్చ సాగుతోంది.