: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు!... విచారణకు రావాలంటూ మత్తయ్యకు నోటీసులు

కొంతకాలం క్రితం తెలుగు రాష్ట్రాల మధ్య పెను అగాధాన్ని సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీ టీడీపీ యత్నించింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎల్విస్ స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేసేందుకు టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నేరుగా స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి తొలి విడతగా రూ.50 లక్షలను అందజేశారు. దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (టీ ఏసీబీ) వెనువెంటనే రంగంలోకి దిగి రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కొంతకాలం పాటు జైల్లో ఉన్న రేవంత్ ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసులో స్టీఫెన్సన్ తో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుుడు ఫోన్ లో మాట్లాడారంటూ విడుదలైన ఆడియో టేపులు పెను కలకలాన్నే రేపాయి. తమ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ఎలా ట్యాపింగ్ చేస్తుందంటూ ఏపీ సర్కారు కూడా పలువురు టెలికాం ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ కు చంద్రబాబు ఆహ్వానం, కేసీఆర్ హాజరు తదితర పరిణామాలతో ఈ కేసు దాదాపుగా మూలన పడిందనే చెప్పాలి. అయితే నిన్న రాత్రి టీ ఏసీబీ అధికారులు ఈ కేసును మరోమారు కదిలించారు. కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు నోటీసులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలని ఆయనకు నిన్న రాత్రి నోటీసులు అందాయి. వారంలోగా విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. ఉప్పల్ లోని మత్తయ్య ఇంటికెళ్లిన ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో, మరో ఇద్దరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (టీడీపీ)ను కూడా తమ పార్టీలోకి లాక్కునే క్రమంలో టీఆర్ఎస్ సర్కారు ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి అందజేసిన నగదును గోపీనాథే సమకూర్చారని, ఈ క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మత్తయ్యకు నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

More Telugu News