: అమరావతి కన్నా విశాఖపట్నమే కీలకం: చంద్రబాబు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగరం కన్నా, విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ కు కీలక నగరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీల అభివృద్ధికి సహకరిస్తామన్న అమెరికాతో ఒప్పందం కుదిరిన వేళ, చంద్రబాబు ప్రసంగిస్తూ, కేంద్రం ప్రకటించిన తొలి జాబితాలోనే స్మార్ట్ సిటీగా విశాఖ ఎంపికైందని గుర్తు చేశారు. అమరావతి నగరం నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంతో కాలం పడుతుందని వెల్లడించిన ఆయన, ఈలోగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రంగా విశాఖ నిలవనుందని అన్నారు.
హుద్ హుద్ తుపాను నుంచి తేరుకుని తలెత్తుకు నిలబడ్డ నగరంలో రెండు ప్రధాన సదస్సులు జరిగాయని, అంతర్జాతీయ నావికా సమీక్ష జరిగిందని తెలిపారు. గతంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో 40 దేశాలు పాల్గొన్నాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వం, ఆ దేశ సంస్థలతో కలసి పనిచేయడం తనకు లభించిన అద్భుతమైన అవకాశంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 7.52 శాతంగా ఉన్న రాష్ట్రాభివృద్ధిని రెండంకెలు దాటించడమే తన ముందున్న తొలి లక్ష్యమని అన్నారు. వచ్చే 20 నుంచి 30 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే నంబర్ వన్ గా నిలుస్తుందనడంలో తనకు ఎటువంటి సందేహమూ లేదని అన్నారు.