: భరతమాతకు అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా?: స్మృతీ ఇరానీ
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరుగుతున్న నిరసనలపై కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ ఘాటుగా స్పందించారు. పార్లమెంటుపై దాడి చేసి, ఆపై విచారణను ఎదుర్కొని ఉరిశిక్షకు గురికాబడ్డ అఫ్జల్ గురు వంటి ఉగ్రవాదిని పొగడటం ఎంతమాత్రమూ సరికాదని ఆమె అన్నారు. "భరతమాతకు అవమానం జరుగుతుంటే జాతి చూస్తూ ఊరుకోబోదు" అని ఆమె హెచ్చరించారు. అంతకుముందు హోం మంత్రి రాజ్ నాథ్ ఇదే విషయమై మాట్లాడుతూ, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, గత మంగళవారం నాడు అఫ్జల్ కు అనుకూలంగా ఓ వర్గం వారు ప్రదర్శన, సభ నిర్వహించినప్పటి నుంచి రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సభ సమయంలో భారత వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ, పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.