: మారని తీరు... మరో 260 పాయింట్లు జారిన సెన్సెక్స్!
భారత స్టాక్ మార్కెట్ లో నష్టాల పర్వం కొనసాగింది. ఆసియా మార్కెట్ల తీరు సెషన్ ఆదిలోనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించగా, క్రితం ముగింపుతో పోలిస్తే 100 పాయింట్ల దిగువ ప్రారంభమైన సెన్సెక్స్ సూచిక మరే దశలోనూ కోలుకోలేదు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్ ను కుదేలు చేశాయి. మధ్యాహ్నం తరువాత షార్ట్ కవరింగ్ తో 200 పాయింట్ల వరకూ రికవరీ వచ్చినప్పటికీ, ఆ వెంటనే మరోసారి లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో రోలర్ కోస్టర్ ను గుర్తుకు తెచ్చిన సెన్సెక్స్ సూచిక మరింతగా నష్టాల లోయలోకి జారిపోయింది. ఇన్వెస్టర్ల సంపద మరో 1.40 లక్షల కోట్లు హారతి కర్పూరమైంది. క్రితం ముగింపు సమయంలో రూ. 90,95,451 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ రూ. 89,55,889 కోట్లకు పడిపోయింది. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 262.08 పాయింట్లు పడిపోయి 1.09 శాతం నష్టంతో 23,758.90 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 82.50 పాయింట్లు పడిపోయి 1.13 శాతం నష్టంతో 7,215.70 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.95 శాతం, స్మాల్ క్యాప్ 1.42 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 13 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. హెచ్సీఎల్ టెక్, అల్ట్రా సిమెంట్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్ తదితర కంపెనీలు లాభపడగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెయిర్న్ ఇండియా, ఎస్బీఐ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,753 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 665 కంపెనీలు లాభాల్లోను, 1,981 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. నిఫ్టీ సూచికకు 7,200 పాయింట్ల వద్ద మద్దతు రాకుంటే మార్కెట్లు మరింతగా పతనమయ్యే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.