: సిక్కు బాలికకు రూ.7 లక్షలు, బ్రాహ్మణ బాలికకు రూ.5 లక్షలు... గుజరాత్ లో ‘లవ్ జిహాద్’ వాట్సాప్ మెసేజ్ వైరల్
గుజరాత్ లో ‘స్టూడెంట్స్ ఆఫ్ ముస్లిం యూత్ ఫోరం’ పేరిట సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ‘వాట్సాప్’ లో ప్రత్యక్షమైన ఓ మెసేజ్ వైరల్ అయిపోయింది. ‘లవ్ జిహాదీ’ పేరిట పోస్టయిన సదరు మెసేజ్ లో ఆ ఫోరం... ఇతర మతాలకు చెందిన యువతులను పెళ్లి చేసుకోవాలని ముస్లిం యువకులకు పిలుపునిచ్చింది. ఈ తరహాలో ఇతర మతాలకు చెందిన యువతులను పెళ్లి చేసుకుంటే, భారీ నజరానాలను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా సామాజిక వర్గాలను కోట్ చేస్తూ సదరు మెసేజ్ లో రివార్డుల చిట్టా కూడా పేర్కొంది. పంజాబీ సిక్కు బాలికను పెళ్లి చేసుకున్న వారికి అత్యధికంగా రూ.7 లక్షల రివార్డును ప్రకటించిన ఫోరం... హిందూ బ్రాహ్మణ బాలికను పెళ్లాడిన వారికి రూ.5 లక్షలను ఇస్తామని ప్రకటించింది. ఇక ఆయా సామాజిక వర్గాలను కేటగిరీలుగా వర్గీకరించిన ఫోరం... సదరు వర్గాలకు చెందిన బాలికలను పెళ్లి చేసుకున్న వారికి ఇచ్చే నజరానాలను వరుస క్రమంలో పేర్కొంది. సదరు నజరానా వివరాలిలా ఉన్నాయి. పంజాబీ సిక్కు బాలికతో పెళ్లి చేసుకుంటే... రూ.7 లక్షలు హిందూ బ్రాహ్మణ బాలిక... రూ.5 లక్షలు గుజరాత్ బ్రాహ్మణ బాలిక... రూ. 6 లక్షలు క్షత్రియ హిందూ బాలిక... రూ.4.5 లక్షలు పంజాబీ హిందూ బాలిక... రూ.6 లక్షలు క్రిస్టియన్ రోమన్ కేథలిక్ బాలిక... రూ. 4 లక్షలు క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ బాలిక... రూ.3 లక్షలు జైన్ బాలిక ... రూ.3 లక్షలు గుజరాత్ కచ్ బాలిక... రూ.3 లక్షలు ఇదిలా ఉంటే, ఆయా హిందూ సామాజిక వర్గాలను లవ్ ట్రాప్ లో పడేసి పెళ్లి చేసుకునే ముస్లిం యువకులు నేరుగా ఈ కింది అడ్రెస్ లకు వచ్చి రివార్డులను తీసుకోవాలంటూ నాలుగు చిరునామాలు కూడా ఆ మెసేజ్ లో ఉన్నాయి. అడ్రెస్ లతో పాటు 11 ఫోన్ నెంబర్లు కూడా ఆ మెసేజ్ లో ఉన్నాయి. ఈ మెసేజ్ వ్యవహారం చివరకు పోలీసుల దృష్టికెళ్లింది. ఇలాంటి వివాదాస్పద మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన పోలీసులు, సదరు మెసేజ్ వస్తే తమకు తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సదరు మెసేజ్ ను పోస్ట్ చేసిన వ్యక్తుల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.